ప్రభుత్వ పాఠశాలల పనులు ఇకపై ఎస్‌ఎంసీలకే... మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

  • పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
  • అన్ని ప్రభుత్వ స్కూళ్లను 3 స్టార్‌కు చేర్చాలని ఆదేశం
  • ప్రవేశాల పెంపునకు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు పిలుపు
  • ప్రభుత్వ కాలేజీల్లో టాపర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచన
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన చిన్న పనులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించి వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెయ్యి మందికి పైగా విద్యార్థులున్న 60 పాఠశాలల్లో 5 స్టార్ సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలన్నారు. లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయిలెట్లు, పెయింటింగ్ వంటి పనులను ఎస్‌ఎంసీలకే అప్పగించాలని సూచించారు. అయితే, మోడల్ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మాత్రం రాష్ట్ర పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారానే చేపట్టాలని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం 'డోర్ టు డోర్' క్యాంపెయిన్ నిర్వహించాలని, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్ల పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలని, డ్రాపవుట్లను సున్నా స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ మార్కులు సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అలాంటి విద్యార్థులను గుర్తించి, 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో సత్కరించాలని, వారి విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh
AP schools
school management committees
Andhra Pradesh education
government schools
school infrastructure
student admissions
Kona Sasidhar
Ranjit Basha
Tamim Ansariyah

More Telugu News